వధువులూ మారారు..!!

వధువులూ మారారు..!!


మొదటగా అబ్బాయికి అమ్మాయి నచ్చాలి.. అమ్మాయికి అబ్బాయి నచ్చాలి
పిమ్మట అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి కానీ సరే అనం
జాతకాలు కలవాలి జ్యోతిష్యుడి సమ్మతం కావాలి
ఈ తంతులన్నీ ముగిశాక పెట్టేదెంత పుచ్చుకునేదెంత అనే లావాదేవీలు మాట్లాడుకోవాలి
అప్పుడే నిశ్చయ తాంబూలాల మార్పిడి!!

ఇప్పటికీ పెళ్ళి కాని సగం మంది అబ్బాయిలకి బోధపడని కొన్ని విషయాలు!!

పల్లెలో ప్రశాంతంగా బ్రతుకుదాం అంటే వద్దంటున్నారు
పట్టణంలో పరిగెత్తుదాం అంటే ముద్దంటున్నారు!!

కడుపులో పెట్టుకొని కాపాడుకుంటా అంటే వద్దంటున్నారు
కడుపు చేసి పారిపోతా అంటే ముద్దంటున్నారు!!

ప్రేమానురాగాలు చూపిస్తా అంటే వద్దంటున్నారు
పైసల్నే నీకోసం బాగా ఖర్చు చేస్తా అంటే ముద్దంటున్నారు!!

ఫ్యామిలీతో గొడవలు ఏం లేవు అంటే వద్దంటున్నారు
ఫ్యాక్షన్లో ఆరితేరాను అంటే ముద్దంటున్నారు!!

రోగాలే లేని రైతుల్ని వద్దంటున్నారు
రోగాల్నే ఆస్తులుగా చెప్పుకునే సాఫ్ట్ వేర్ని ముద్దంటున్నారు!!

బంగారమంటి మనసున్న వాడిని వద్దంటున్నారు
బంగారం మాత్రమే వున్న బంగార్రాజుల్ని ముద్దంటున్నారు!!

కాళ్ళని నమ్ముకున్న వాళ్ళని వద్దంటున్నారు
కార్లని నమ్ముకున్న వాళ్ళని ముద్దంటున్నారు!!

తల్లిదండ్రులు మన వూరి నుంచి వస్తాం అంటే వద్దంటున్నారు
తల్లిదండ్రులు వాళ్ళ వూరి నుంచి వస్తాం అంటే ముద్దంటున్నారు!!

వసుదైక కుటుంబానికి వేర్లు లేకుండా చేస్తూ
ఒంటరి కుటుంబానికి తిలకాలొద్దుతున్న ఈతరం యువత.

ఒకప్పుడు అమ్మాయిలు మంచోడు భర్తగా వస్తే చాలు అనుకునే వాళ్ళు
మాట వినే భర్త రాకపోయినా మార్చుకునే నైపుణ్యం తమకి వుందిగా అనే ధీమా.
కానీ ఇప్పటి తరం ఏ లక్షణాలు చూసి అబ్బాయిలని ఎంచుకుంటున్నారో అర్దం కాని పరిస్థితి.
అలాంటి వాటిని మీ ముందుంచాలనే చిన్న తాపత్రయం!!

                                                                                                     లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

అమ్మ కొడుకు...

అబ్బాయికి 'అప్పగింతలు' !!

మన ఊరి 'సంక్రాంతి'!!