మన ఊరి 'సంక్రాంతి'!!

మన ఊరి 'సంక్రాంతి'!!


ఆగస్ట్ లో అందరినీ సెలవుల కోసం విసిగించేయడాలు
సెప్టెంబర్ నుంచే పండగ గురించి ఆలోచనలు
నవంబర్ లో ఏం నాటకాలు వేయాలా మన వాళ్ళ కోసం అని జుట్టు పీక్కోవడాలు
డిసంబర్ లో డ్యాన్స్ లు ఏం నేర్చుకోవాలి స్టేజ్ మీద వేయడానికి అని ఆత్రుతలు
జనవరి 1st ఒక పండగే కాదన్నట్టు పక్కకి తిరిగి పండగ కోసం ఎదురు చూపులు
ఇవండి తెలుగు పల్లెల్లో పుట్టిన ప్రతొక్కడూ ఎదురు చూసే క్షణాలు...

కొన్న కొత్త బట్టలు సంచుల్లో సర్దుకొని
ఒక పది రోజుల పాటు ఈ పట్టణంతో పనే లేదన్నట్టుగా
ముందుగానే మనం బుక్ చేసుకున్న సీట్ ఎక్కడుందా అని తిరుగుతున్న వేళ
వస్తుందండి మనల్ని మన వూరికి ఆప్యాయంగా తీసుకెళ్ళే మన మిడిల్ క్లాస్ విమానం
అదేనండి "రైలు బండి"!!

వూరి దగ్గర్లోని స్టేషన్ లో దిగీ దిగగానే, మన పరిసరాల్లోకి వచ్చేశామనే భావన
ఇక అక్కడినుంచి కాలు ఆగదు.. ప్రతీ బస్సు మనూరికే వెళ్తే బాగుండు అని అనుకోవడాలు
సీట్ లు లేవని కండక్టర్ చెప్పినా పర్లేదండి అని బ్యాగ్ లు పైన పెట్టి నుంచోడానికి సిద్దమవడాలు
బస్సు కొట్టే హారన్ అయినా వినసొంపైన సంగీతంలా వినబడడాలు
చేలల్లో వూగే పైరు మనకి స్వాగతం చెప్తున్నట్టు చెయ్యి వూపడాలు
కాలుష్యం లేని గాలి ఈ పది రోజులైనా పీల్చుకోండని స్వఛ్చమైన గాలి మదిని తాకడాలు
సంవత్సరం పాటు ఈ పది రోజులకోసమే ఎదురుచూశామా అన్నట్టు కళకళలాడే మొహాలు!!

ఊరి బస్టాండ్ లో దిగడమే ఆలస్యమన్నట్టు,
మన రాక గురించి ఇంట్లో తెలిసేసుకొని ఎదురు చూస్తున్న చిన్ననాటి స్నేహితులు
చేతిలో బరువు మాకొదిలేయండహే అని చనువుతో లాక్కుంటుంటే
ఎప్పుడో 10వ తరగతి లో ప్రేమించిన అమ్మాయి ఇంటి ముందు నుంచి ఓర చూపు చూసుకుంటూ వెళ్తూ
ఇంట్లో బ్యాగ్ లు పెట్టీ పెట్టగానే, కోడి పందాలు చూడ్డానికి వెళ్దామని స్నేహితులు గొడవ చేస్తుంటే
వీధిలో అడుగిడింది మొదలు ఎదురొచ్చే ప్రతీ ఒక్కరిని బంధుత్వంతో పిలుస్తుంటే
వెళ్ళిన ప్రతీ ఇంట్లో చక్రాలు అరిసెలూ మన ముందుకొస్తుంటే
మొహమాటం గానే ఒక్కొక్కటీ రుచి చూస్తూ అద్భుతహా అని మెచ్చుకుంటూ
భోగి రోజు ముస్తాబు చేయాల్సిన వీధి గురించి చర్చించుకుంటూ
అర్ధరాత్రైనా రంగుల కాగితాలు అతికిస్తూ అలుపన్నదే లేనట్టు
భోగి రోజు తెచ్చి వుంచిన పనికిరాని వస్తువులన్నీ మంటల్లో వేసి చలి మంట కాచుకుంటూ
పండగ రోజు, అబ్బాయిలు వేయకపోయినా ముగ్గుల వంక బాగుందే అన్నట్టు చూస్తూ
కొత్త బట్టలు పిత్రు దేవతలకి సమర్పించుకొని, పిండి వంటలు తినేస్తూ
డ్యాన్స్ లు ఒక వైపు, నాటకాలు ఇంకో వైపు... ఇలా ఎటు చూసినా ఆనందమే....

పండగైపోగానే, తీసుకెళ్ళిన బ్యాగ్ లకి రెండింతలు మనతో పాటు రావడానికి రెడీ
దీనమైన మొహాలతో ఇక మళ్ళీ సంవత్సరం ఆగాలి మీరు నా కోసం అని బాధగా
మనల్ని బస్ ఎక్కించే పండగే మన " సంక్రాంతి "!!

                                                                                                                             లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

అబ్బాయికి 'అప్పగింతలు' !!

అమ్మ కొడుకు...