అబ్బాయికి 'అప్పగింతలు' !!

అబ్బాయికి 'అప్పగింతలు'


వేద మంత్రాల సందడిలో కట్టిన తాళి మెడను అలంకరించిన వేళ
కనిపించని అరుంధతిని పతి చూపిస్తుంటే కనిపించిందనే తలూపిన వేళ
సిగ్గుతో కాకుండా ఆందోళనతో పెళ్ళి కూతురు తలదించుకున్న వేళ
సంభావన ఎంతిస్తారో అనే తలంపులతో బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతున్న వేళ
భోజనాలలో ఏం వడ్డిస్తారో అని ఎదురుచూస్తున్న పెళ్ళి పెద్దలు చుట్టూ వున్న వేళ
చదివింపులు ఎంత చదివిద్దాం అని మన బంధువులు ఆలోచిస్తున్న వేళ
భాద్యత తీరిపోయిందని తినకుండానే కడుపు నిండిందనుకునే పిల్ల తల్లిదండ్రుల ఆనంద వేళ
మెట్టినింట మహాలక్ష్మి అడుగుపెట్టనుందనే అత్తా మామలు సంబర పడుతున్న వేళ

ఇప్పటి వరకూ నవ్వింది చాలు కొంచెం సేపైనా ఏడవండి అని నవ్వుకుంటూ వచ్చే ఘట్టమే
'అప్పగింతలు'

మమ్మల్నొదిలి అమ్మాయి ఎప్పుడూ వుండలేదు అల్లుడు గారూ...
జాగ్రత్తగా చూసుకోవయ్యా...

ఏదైనా తప్పు చేస్తే మెల్లిగా చెప్పండి అల్లుడుగారు
అమ్మాయిని ఇప్పటివరకూ పల్లెత్తి మాటనలేదు.. చేయెత్తి కొట్టనూ లేదు.

ఇక నుంచి చావైనా బ్రతుకైనా నీకు మెట్టినిల్లే తల్లి, అని అమ్మాయిని భారంగా సాగనంపుతుంటే
తల్లిదండ్రుల్ని విడిచి కొత్త ప్రప్రంచం లోకి అడుగుపెడుతుంది ప్రతీ అమ్మాయి.
ఇవి ఇప్పటి వరకూ మనమెరిగిన మనకు తెలిసిన 'అప్పగింతలు'.

పెళ్ళయ్యాక ఒక సంవత్సరం పాటు చాలా బాగుంటుంది.. అత్తయ్యా మీరెందుకు పని చేయడం నేనున్నాగా
మావయ్యా బయట ఎండగా వుంది త్వరగా వచ్చేయండి.. మరిదిగారూ స్నానానికి వేడి నీళ్ళు పెట్టానండి... ఇలా బోలెడు...

ఏడాది గడిచీ గడవగానే,
నేనేమైనా ఈ ఇంటి పనిమనిషినా, మీ అమ్మ నాన్నలకు చాకిరీ చేయడానికి
వయసొస్తే సరిపోదు బుద్ధీ జ్ఞానం వుండాలి అని వాళ్ళనే ఆడిపోసుకోవడం
భర్త ఒప్పుకుంటే సరి లేదంటే పస్తే కడుపుకీ, పడకగదికీ.

బహుశా పెళ్ళప్పుడు ఆమెని వాళ్ళ తల్లిదండ్రులనుంచి విడదీశాం అనే కోపమో ఏమో
కష్టమో నష్టమో సాంప్రదాయం ప్రకారం మీరు అందరినీ వదిలి అత్తగారింటికి వచ్చారు.
వాళ్ళను వదలాల్సొచ్చినప్పుడు మీకు కలిగిన భాధ, వేరు కాపురం పెడదాం అన్నప్పుడు మాకు కలగదా?
ఇప్పుడు మీరు ఇలా చేస్తే రేపు మీ కొడుకు మాత్రం మీతో ఎలా కలిసి వుంటాడండి?
మీ మాటే నెగ్గాలి అని భర్తపై మీరెంత ఒత్తిడి తెచ్చారో అంతకంటే నాలుగాకులు ఎక్కువే మీ కోడలు చేసేది..

ఏ అత్తా కోడలిని కూతురులాగా చూసుకోలేదు, అలాగే ఏ కోడలూ అత్తగారిలో తల్లిని చూడాలనుకోదు
ఎంతసేపూ విడి కాపురం ఎప్పుడు పెడదామా అనే ఆలోచనలే
మార్పు అనేది రెండు వైపులనుంచి వుండాలండి.. అత్త మీద చాడీలు కోడలు చెప్పకూడదు, కోడలు తప్పు చేసినా అత్త చాటింపు వేయకూడదు..

వసుదైక కుటుంబం గురించి ప్రపంచానికి చాటి చెప్పిన భారతదేశ సాంప్రదాయాల్ని మనలో పాటిస్తుందెంతమంది?
జీవితం అనేది బహుదూరపు ప్రయాణం.. ఒంటరిగా వెళ్దామంటే చాలా విసుగొస్తుంది
అదే అందరినీ కలుపుకుపోదాం అంటే కష్టమనేదే తెలీనంత హాయిగా గమ్యముంటుంది!!

                                                                                                                                  లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

అమ్మ కొడుకు...

మన ఊరి 'సంక్రాంతి'!!