మారాల్సిందెవరు..?

మారాల్సిందెవరు..?


3 యేళ్ళు నిండకుండానే 3 కేజిల బరువు సంచితో పాఠశాలకు
మాటలు పలకలేని వయస్సులోనే పాఠాలు నేర్పిచాలనే తపన
అయిదేళ్ళవరకు ఆగితే అందకుండా పోతాడేమోననే భయం
వూళ్ళో వుండి చదువుకుంటే వెదవ అవుతాడేమోననే అనుమానం
హాస్టల్ లో వుంచి చదివిస్తే హై లెవల్ కి వెల్తాడనే ఆశ
పదే పదే గుర్తొస్తున్నా పిల్లల భవిష్యత్తుకి తప్పదనే బాధ
తల్లిదండ్రులున్నా తల దువ్వే అమ్మ పక్కనలేదనే ఆవేదన
ప్రేమని చూపించే వాళ్ళు కరువైన ఆ దౌర్భాగ్య క్షణాన
దారిన పోయే ఎవడు ప్రేమగా మాట్లాడినా మంచి అని అనుకునే మాయలో
ప్రేమ ఇది మా హక్కు అనే ఊబిలో పడుతున్న ఈనాటి యువతరం!!

తప్పు ఎవరిదండి ఇక్కడ..?
పెద్ద కొలువు అనే ఆశతో చిన్న చిన్న ప్రేమలకి దూరం చేస్తున్న తల్లిదండ్రులదా..?
తల్లిదండ్రుల ప్రేమని కాకుండా వాళ్ళు పంపించే పైసల్నే చూస్తున్న మన యువతదా..?

అయిదు సంవత్సరాలకి పాఠశాలకి పంపిస్తే ఏం అవుద్దండి,
2 సంవత్సరాలు చదువులో వెనకబడతాడా..
ఆ రెండు సంవత్సరాలు అమ్మ ప్రేమంటే ఏంటో నిజ జీవితంలో చదువుకుంటాడు.
మమ్మీ అనే పదం బదులు అమ్మ అని పిలవడం నేర్చుకుంటాడు!

వూళ్ళో వుండి చదువుకుంటే వెదవే ఎందుకౌతాడండి..
వ్యవసాయం గురించి తెలుసుకుంటాడు, రైతుల్ని గౌరవించడం అలవాటు చేసుకుంటాడు!

హాస్తల్ లో వుండి చదువుంకుంటే హై లెవల్ కే వెళ్ళాలని ఏముంది
హద్దులు లేని జీవితానికి నిచ్చెనలు వేసుకోవడం కూడా చేయొచ్చు కదా!

అంతా అయ్యాక మీకు వాళ్ళని చూడాలనిపించినా
వాళ్ళకి మీరు గుర్తుకురారు.. ఎందుకంటే ఒక్కడిగానే వుండడం హాస్టల్ లో అలవాటు చేసారు కదా!

మార్కుల కోసం కాకుండా మర్యాదగా మెసలడం నేర్పించాలి,
గవర్నమెంట్ జాబ్ కోసం కాకుండా గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం నేర్పించాలి,
జీతం కోసం చదువు కాకుండా సంస్కారం నేర్చుకోవడానికే చదువు చెప్పించాలి,
ఇలా ప్రతీదీ మన పిల్లలకి నేర్పాలిసింది మనమే. ఎందుకంటే బిడ్డలకి తల్లిదండ్రులే మొదటి గురువులు కనుక!!

                                                                                                                               లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

అబ్బాయికి 'అప్పగింతలు' !!

అమ్మ కొడుకు...

మన ఊరి 'సంక్రాంతి'!!