బద్దకమే అభివృద్దా??

బద్దకమే అభివృద్దా??


తప్పక చేస్తున్నామో తప్పనిసరై చేస్తున్నామో మనకి మనమే తెలుసుకోలేని కొన్ని విషయాలివన్నీ..
అభివృద్ది అని ముందుకెళ్తున్నామో.. ఎంత చేసినా మన పెద్దవాళ్ళ ఆయుషుని అందుకోలేకపోతున్నామో తెలీదు కానీ..
బద్దకమే మనం సాధించిన అతి పెద్ద అభివృద్ది అని చెప్పడంలో ఎటువంటి అతిశయం లేదు.!! చదివాక మీ మాట కూడా అదే కావొచ్చు!!

వేప పుల్లలతో పళ్ళు తోముకుంటే చాలా మంచిది అని తెలుసూ..
కానీ వంట గదిలో వున్న వస్తువులన్నీ పేస్ట్ లో కుక్కి బ్రష్ మీద వేస్తేనే మనకిష్టం..
పుల్లలతో తోముకుంటే మన కంటబడని ఎన్నో దంత రోగాలు వీటి వాడకం మొదలవ్వగానే వచ్చాయని బాధపడాలో
సమయం చాలా ఆదా అయిందని ఆనందపడాలో అర్ధం కాని పరిస్థితి!!

కుంకుడు కాయలతో తలస్నానం అన్ని పోషకాలు జుట్టుకి అందివ్వడం అని తెలుసూ..
షాంపూ ఐతే కళ్ళు మండవు.. పైగా చాలా త్వరగా అయిపోద్ది అని,
షాంపూలతో ఆరోగ్యంగా వున్నదాన్ని చెడగొట్టి బట్ట తలలు తెచ్చుకుంటున్నాం అని బాధపడాలో
బోడి గుండయ్యాక రోజూ దువ్వుకునే బాధ తప్పిందని ఆనందపడాలో అర్ధం కాని పరిస్థితి!!

పట్టుమని పదినిమిషాల నడకైనా వుండధు...
కార్ బుక్ చేస్తాం లేదంటే ఆటో కావాల్సిందే..
బద్దకం వల్ల రోగాలు వస్తున్నాయని బాధపడాలో..
ఇంకొకరికి మనవల్ల ఉపాధి కలిగిందని ఆనందపడాలో అర్దం కాని పరిస్థితి!!

పగలంతా ఆఫీస్ పనులు చేసొచ్చి ఇంటికొచ్చాక..
వండుకోవడం అరగంట పని.. కానీ హోటల్ లో ఆర్డర్ చేస్తే 10 నిమిషాలే పని
బయట తిండి వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని బాధపడాలో
వెజ్ ఆర్డర్ చేస్తే నాన్-వెజ్ వచ్చిందని ఆనందపడాలో అర్ధం కాని పరిస్థితి!!

రోడ్ మీద కొన్నా రిలయన్స్ లో కొన్నా అవే పళ్ళు అని తెలుసూ..
చూసేవాళ్ళ కోసం బయట కొనడం కంటే మార్ట్ లలో కొనడానికే ఎక్కువ ప్రాధాన్యం..
లేని వాడికంటే వున్నవాడికే మన డబ్బు వూడ్చి పెడుతున్నాం అని బాధపడాలో
అమ్మాయిల ముందు కట్టింగ్ వర్క్ అవుట్ అయిందని ఆనందపడాలో అర్ధం కాని పరిస్థితి!!

కుట్టు మిషన్ మీద బట్టలు కుట్టించుకుంటే ఎక్కువకాలం వుంటాయని తెలుసూ..
అదే రెడీ మేడ్ కొంటే రంగు వెలిసిపోయినా పర్లేదు.. సైజ్ చాలక పోయిన చింత లేదు..
చిరిగినవి కొత్త ఫ్యాషన్ అనీ.. ఎన్ని వుతుకులేసినా చెక్కు చెదరనివి వోల్డ్ ఫ్యాషన్ అని మనసుకు అబద్దం చెప్పి బాధపడాలో
అందరిలో మనం తక్కువగాలేం ట్రెండ్ ని బట్టి ముందుకు పోతున్నాం అని ఆనందపడాలో అర్ధం కాని పరిస్థితి!!

కొబ్బరి బోండాలు తాగితే అనాగరికం -- కూల్ డ్రింక్ లు తాగితే నాగరికం!!
పుట్టినరోజు దీపం వెలిగించి గుడికెళ్తే అనాగరికం -- అదే దీపాలు ఆర్పి కేక్ లు కట్ చేస్తే నాగరికం!!
పొద్దున్నే సద్దన్నం తింటే అనాగరికం -- అదే పిజ్జా తింటే నాగరికం!!

పైవన్నీ చూస్తుంటే ప్రతీ విషయంలో మనం సర్దుకుపోతుంది సమయం కోసం, దాన్ని వృధా చేయకుండా ఉండడం కోసం
మనిషి జీవిత కాలం తగ్గిందని ఇక్కడ సమయం ఆదా చేసుకుంటున్నామా..?
సమయం ఆదా అని ఇవన్నీ చేయడం వల్ల జీవిత కాలం తగ్గిపోతుందా..?
చివరగా, కాలంతో పరిగెడుతున్నామో.. కాటికి ముందుగా చేరాలని పరిగెడుతున్నామో ఆ కలియుగ దేవునికే ఎరుక!!

                                                                                                                                  లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

పట్టణంలో ఇంటికోసం..!!

అబ్బాయికి 'అప్పగింతలు' !!

నాన్న విలువ...