ఎవరిదీ తప్పు..?

ఎవరిదీ తప్పు..?



న్యూస్ పేపర్స్ లోనో చానల్స్ లోనో పైన ఉన్న చిత్రాన్ని మీరు చూసే ఉంటారు..
అది తల్లిదండ్రులు అంత్యంత కర్కశంగా తమ సొంత బిడ్డనే కడతేర్చిన వైనం... వేరే కులం అబ్బాయిని, పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్ళి చేసుకున్న ఒక నారీమణికి భారతదేశంలో పట్టిన గతి...

ప్రేమ విషయం చెప్పగానే ఇంట్లో వాళ్ళు వద్దంటారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా... 20 సంవత్సరాలు మన అమ్మాయిగా పెరిగిన పిల్ల ఒకతన్ని ప్రేమించాను అంటే ఆరా తీయడం మానేసి ఆవేశంతో ఊగిపోయే పరిస్థితి..
మన పెద్దవాళ్ళు ఎందుకు ఒప్పుకోవడం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా?? వాళ్ళ భయం వాళ్ళది... ఉన్న ఒక్కగానొక్క నలుసు ప్రేమ అనే మాయలో పడి
తన బంగారు జీవితాన్ని ఎక్కడ నాశనం చేసుకుంటుందో అని... అంతే కానీ ఏ తల్లిదండ్రులూ తమ బిడ్డలకి మంచి జీవితం దొరుకుంతుంది అంతే దాన్ని కాలరాయాలని చూడరు..

పారిపోయి పెళ్ళి చేసుకోవడం!!! ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి.. వాళ్ళని ఎలాగైనా ఒప్పించడానికి ప్రయత్నిచాలి కానీ వాళ్ళని వదిలేసి నీ దారి నువ్వు చూసుకోవడం ఏంటి?
చిన్నప్పటినుంచీ నువ్వు ఏం అడిగినా కాదనకుండా తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రేమించిన అబ్బాయిని కాదంటున్నారు అంటే వాళ్ళలో ఎన్ని భయాలున్నాయో అర్ధం చేసుకొని వాటిని తుడిచి వేయడానికి ప్రయత్నిచరెందుకు??
వేరే కులం అబ్బాయిని పెళ్ళి చేసుకున్నందుకు తల్లిదండ్రులు కూతుర్నే చంపేద్దాం అనుకున్నారంటే దానికి వాళ్ళు ఎంత విలవిలలాడిపొయుంటారు..?
వాళ్ళు ఆ పని చేయడానికి నాకు కనిపించిన కొన్ని కారణాలు...

1. రోడ్ మీద వెళ్తుంటే మీ అమ్మాయి లేచిపోయిందటగా?? నువ్వేమి మనిషివయ్యా అదే మా అమ్మాయి ఇలా చేసుంటేనా
చంపి పెద్ద ఖర్మ చేసేసేవాడిని ఈపాటికి అంటాడో పెద్ద మనిషి..
2. ఇంకోడు వెకిలిగా.. నీ చిన్న కూతురికైనా నువ్వు పెళ్ళి చేస్తావా?? లేదంటే ఆమె కూడా ఆ లేచిపోయే బాపతేనా??
3. ఒకవేళ మన తల్లిదండ్రులు మన ప్రేమని ఒప్పుకొని పెళ్ళి చేస్తే, అదేంటయ్యా వేరే కులం వాడికిచ్చి పెళ్ళి చేసావ్..? సిగ్గు లేదూ??
   రేపు పుట్టబోయే పిల్లల కులం గోత్రాలు ఏం కావాలి? వాళ్ళకి పెళ్ళిళ్ళ కోసం మనం ఎక్కడెక్కడ తిరగాలి??
  
సమాజం ఏదో అంది అని కన్నబిడ్డల్నే చంపుకుంటామా అని మీరు అనొచ్చు.. కానీ మన పెద్ద వాళ్ళు పుట్టి పెరిగిన పరిస్థితులు అలాంటివి.
వాళ్ళెప్పుడూ సమాజంలో గౌరవంగానే ఉండాలనుకుంటారు తప్ప తలదించుకొని ఒకళ్ళ ముందు నిలబడాలని ఎప్పుడూ కోరుకోరు..
అదే మనం ఐతే ఇలా వెకిలిగా మాట్లాడే ప్రతీ ఒక్కడికీ సరైన సమాధానం చెప్పే ముందుకు వెళ్తాం.. అందుకే మనకి సమాజం ఏమి అనుకున్నా పర్లేదు.. ఎందుకంటే సమాజం కంటే మన బిడ్డలే మనకి ఎక్కువ..

ఇలా సమాజంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆ పిల్ల చావుకి కారణం.. అదే మనం ఈ వెకిలి వేషాలు వేయకుండా ఉంటే ఆ తల్లిదండ్రులు అంతటి పాపానికి ఒడిగడతారా...??  
అలా అని నేను పిల్లల్ని చంపడం సమర్ధించడం లేదు... తప్పు వాళ్ళొక్కళ్ళదే కాదు మనది కూడా అని చెప్పాలన్నదే నా ఈ ప్రయత్నం..
ఇలాంటివి ఆగాలంటే ముందు మారాల్సింది మనం.. ఎవరో మహాకవి చెప్పినట్లు నువ్వు ఏ మార్పు అయితే చూడాలనుకుంటున్నావో ఆ మార్పు ముందు నీతో మొదలుపెట్టు.. !!

                                                                                                                                 లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

పట్టణంలో ఇంటికోసం..!!

అబ్బాయికి 'అప్పగింతలు' !!

నాన్న విలువ...