ఆ రోజులు..!!

ఆ రోజులు..!!

ఒంటిపూట బడుల కోసం ఒంటి కాలుపై ఎదురు చూసిన ఆ రోజులు,
ఎండాకాలం సెలవుల్లో నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన ఆ రోజులు,
రూపాయికి రెండు పుల్ల ఐసులు కొనుక్కున్న ఆ రోజులు,
చిరిగిన నిక్కర్లతో బడికి వెళ్ళిన ఆ రోజులు,
బియ్యం సంచితో స్కూల్ బ్యాగ్ ని కుట్టించుకున్న ఆ రోజులు,
పక్కన ఉన్న అమ్మాయిని స్నేహితురాలిగా మాత్రమే చూసిన ఆ రోజులు,
కరెంట్ లేకపోయినా చెమటలు కారేలా క్రికెట్ ఆడిన ఆ రోజులు,
ప్రైవేట్ లో కరెంట్ పోగానే కొవ్వొత్తి ముందు గుమిగూడి ముచ్చట్లాడిన ఆ రోజులు,
కరుగుతున్న కొవ్వొత్తిని గిన్నె కొవ్వొత్తిలా మార్చేసిన ఆ రోజులు,
చీకటైతే చల్లని గాలికోసం ఆరుబయట మంచాలేసిన ఆ రోజులు,
అమ్మ పక్కన పడుకున్నట్టు నటిస్తూ కొంగుకున్న చిల్లర నొక్కేసిన ఆ రోజులు..

ఆ రోజులకీ ఈ రోజులకీ పోలికా? అవి గోమాత నుంచి వచ్చే పవిత్రమైన గోమూత్రమైతే,
ఇవి మనమే కల్తీ చేసిన జెర్సీ ఆవుల నుంచి వస్తున్న పాలదారవంటివి..

సెల్ ఫోన్లు లేకపోయినా ఉత్తరాలతో ఊరిలో ఉన్న చుట్టాలని చుట్టేసిన రోజులవైతే,
బంధువులకి దూరంగా ఉన్నామో భార్యాబిడ్డలకి దగ్గరగా ఉన్నామో అర్ధం కాని రోజులివి!!

అనుబంధాలకోసం, ఆప్యాయతలకోసం ఆస్తులని సైతం వదులుకున్న రోజులవైతే,
అవే ఆస్తులకోసం అన్నదమ్ములనైనా చంపడానికి వెనుకాడని నీచమైన రోజులివి!!

ఇంటికొచ్చిన అతిధులకి మర్యాదలు చేసి మంచి చెడ్డలు అడగడం మన సాంప్రదాయం అని తెలిసిన రోజులవైతే,
ఎక్కడ మంచి నీళ్ళు ఇవ్వాల్సొస్తుందేమో అని గుమ్మం దగ్గరే మాట్లాడేసి తలుపులు బిగించుకునే రోజులివి!!

టెక్నాలజీకి దగ్గరవుతున్నామో, టెన్షన్లకి దగ్గరవుతున్నామో తెలుసుకోలేని రోజులివైతే,
టెక్నాలజీలతో పరిచయం లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడిపిన మధురమైన రోజులవి.
ఆధునికత అవసరమే, అవి మనిషి జీవన ప్రమాణాల్ని పెంచేవిలా ఉండాలి కానీ,
పగలు పెంచేలా, మనసుల మధ్య దూరాలు పెంచేలా ఉండకూడదు అని చెప్పాలన్నదే నా ఈ తాపత్రయం!!

                                                                                                                       లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

పట్టణంలో ఇంటికోసం..!!

అబ్బాయికి 'అప్పగింతలు' !!

నాన్న విలువ...