'ఇప్పటి' వినాయకచవితి!

'ఇప్పటి' వినాయకచవితి! 
 

పాలు తాగే పిల్లల దగ్గరినుంచి పంచ కట్టిన పెద్దోళ్ళ వరకు,
కన్నె పడుచుల దగ్గరినుంచి కాటికి కాళ్ళు చాపిన ముసలమ్మల వరకు,
బిటెక్ చేసినవాళ్ళ దగ్గరినుంచి బియ్యం పండించే వాళ్ళ వరకు,
పని కోసం ఎదురుచూస్తున్న యువత దగ్గరినుంచి ప్రభుత్వ ఉద్యోగస్తుల వరకు
ఆది దేవుడనైనా కావొచ్చు, వింతైన ఆకారం వల్ల కావొచ్చు ఇలా అందరికీ వినాయకచవితి అంటే ప్రత్యేకమైన అభిమానమే!!

నా చిన్నప్పుడు,
వేకువ జామున పత్రికోసం పొలాల గట్ల మీద పరిగెట్టినా,
రూపాయికి ఒక మట్టి బొమ్మ ముద్రేసి ఇచ్చినా,
దాన్ని తామరాకులో పెట్టుకొని ఇంటికొస్తుంటే పొందిన ఆనందమైనా,
కుంకుడు కాయలతో తలంటు పోసుకున్నా,
కొత్త బట్టలు, చదవాల్సిన పుస్తకాలు పత్రితో పాటు గణపయ్య ముందుండినా,
వినాయక చరిత్ర అందరికి అర్ధమయ్యేలా చదివినా,
ఉండ్రాళ్ళు బొజ్జ గణపయ్యకి నైవేద్యంగా సమర్పించినా,
బయటకెళ్ళి ఒక పదినిముషాలు తలుపులు మూసివేసినా,
దేవుడొచ్చి మనమెట్టిన నైవేద్యం తింటాడని నమ్మినా,
బజార్లో పెట్టిన పెద్ద మట్టి వినాయకుడితో మన బుజ్జి గణపయ్యని కలిపేసినా..

ఇవన్నీ ఆ రోజులకే చెల్లిపోయాయి!! ఇప్పుడంతా కమర్షియల్ గా వినాయకచవితిని జరుపుకునే
కలికాలం రోజులు. కమర్షియల్ వినాయకచవితిలో మనం చేస్తున్న పొరపాట్లు.

పండగంటే పదిమందితో కలిసి చేసుకునేది కానీ
అదే పదిమందితో పోట్లాడి చేసుకునేది కాదు.

భక్తి పాటలతో చేయాల్సిన ఊరేగింపు కానీ
బూతు పాటలతో చేసే కచ్చేరీ కాదు.

భగవంతుడికి సంతోషంగా చందా ఇవ్వాలి కానీ,
భయపెట్టి బెదిరించి మరీ లాక్కోవడం చేయకూడదు.

పూనకం వచ్చి డ్యాన్స్ లు వేయాలి కానీ
ఫూటుగా తాగి ఎగర కూడదు.

రక్షిస్తాడు అని మనం నమ్మే వినాయకుడినే,
పర్యావరణాన్ని తన విగ్రహం తోనే శిక్షించేలా చేస్తున్నాం.

పండగని పండగలా చేసుకుంటే అంతా ఆనందమే,
అలా కాకుండా కానిచ్చేద్దాం ఈసారికిలా, పంపించేద్దాం పొనీ ఇలా అని చేసుకోవడం ఆపాలి.
అప్పుడే భారతీయ సాంప్రదాయాల్ని మన తరువాతి తరాలకి అందించిన వాళ్ళమవుతాం!!

                                                                                                             లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

పట్టణంలో ఇంటికోసం..!!

అబ్బాయికి 'అప్పగింతలు' !!

నాన్న విలువ...