మనిషికి మనిషే శత్రువు..!!

మనిషికి మనిషే శత్రువు!!



బాగా రద్దీగా ఉన్న ఒక పట్టణం, అందులో తోపుడు బండి మీద జామకాయలు అమ్ముకుంటున్న ఓ చిరు వ్యాపారి.
అతని మనసులో ఎన్నో ఆలోచనలు.. ఈ రోజైనా ఒక 200 రూపాయలకి అమ్మితే బాగుండు, ఇంటికెళ్తూ తన చిట్టి తల్లి
రెండు రోజులనుంచి అడుగుతున్న నోటు పుస్తకం కొనుక్కెళ్దామని.. అది ఇచ్చినప్పుడు తన కూతురు మొహంలో కలిగే ఆనందం
కోసం ఇంకో 2 గంటలైనా అదే ఎండలో నిలబడడానికి సిద్దం.

తను కష్టపడి పోగేసిన రూపాయి రూపాయి బ్యాంక్ లో దాచుకుంటే ఉపయోగం ఏంటని
సంవత్సరానికో 1000 రూపాయలు వచ్చినా వచ్చినట్టే అనే ఆశతో వడ్డీకి ఇచ్చిన ఓ సగటు మధ్యతరగతి వ్యక్తి ఇంకో వైపు.
కొడుకు కాలేజ్ ఫీజ్ కట్టడానికి ఆఖరి రోజు దగ్గర్లోనే ఉందని గుర్తెరిగి, ఈరోజైనా తను వడ్డీకిచ్చిన వాళ్ళు తిరిగి తన
డబ్బులు ఇస్తారేమో అన్న ఆశతో కాళ్ళీడ్చుకుంటూ అటువైపుగా మొదలైన నడక.

ఇంతలో ఒక ముగ్గురు బండి వైపు దూసుకొచ్చి, జామకాయల్ని తీసుకొని తింటూ.. డబ్బులిద్దాం అనే ఉద్దేశ్యం ఇసుమంతైనా కనపడని వాళ్ళమొహంలో,
మత్తులో ముంగిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ధోరణి కనిపించింది ఆ తోపుడు వ్యాపారికి..
దగ్గరికెళ్ళి, తీసుకున్న పళ్ళకి పైకం చెల్లించమని కొరుకున్నాడా చిరు వ్యాపారి..
ఇక అంతే ముగ్గురు ఏకమై ఒకటే పిడి గుద్దులు.. కాలితో తన్నడాలు.. దీన్నంతటినీ తమ తమ ఫోన్లలో నవ్వుకుంటూ వీడియో తీసే ప్రభుద్దులు చుట్టూ..
కళ్ళు తెరిచేసరికి వైద్యశాలలో అతని పెళ్ళాం ఒక వైపు, తన ముద్దుల చిట్టి తల్లి ఇంకో వైపు ఏడుస్తూ..!!

చచ్చిపోతాడేమో అనే ఆలోచన కూడా లేకుండా ఒక నలుగురు యువకులు అప్పిచ్చిన పెద్దాయన్ని కొడుతున్నారు.. పక్కనే ఒకావిడ ఏడుస్తూ భూతులు తిడుతుంది,
తన్నే వాళ్ళనని పొరబడకండి, ఆ తన్నించుకుంటున్న వ్యక్తికే ఆ ఆశీర్వాదాలు. అతను చేసిన తప్పల్లా వాళ్ళింటికి వెళ్ళి అందరిముందు
తను అప్పుగా ఇచ్చిన డబ్బులు అడగడమే.... కుక్క కంటే హీనంగా రోడ్ పై బోర్లించి ఒక మనిషిని కొడుతుంటే  చుట్టూ చేరిన వాళ్ళు
ఎందుకు అని కూడా అడగలేదు.. అడిగితే ఆ కర్రలు వాళ్ళవైపుకి వస్తాయేమో అనే భయం. విషయం తెలిసి వాళ్ళ కొడుకే కాలేజ్ మానేసి,
క్షమాపణలు అర్పించి, ఇచ్చిన డబ్బులు త్యజించి వాళ్ళ నాన్నని తీసుకొచ్చాడు పైకి ఉబికి వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ..!!

ఇక్కడ వీళ్ళిద్దరూ పోరాడాల్సింది కష్టాలతో కాదు కనికరంలేని కుళ్ళు మనుషులతో, మంచితనం అన్నదే లేని మన సమాజంతో..
చిన్నప్పుడు మనం చీకటంటేనో, దెయ్యాలంటేనో భయపడిపోయేవాళ్ళం కానీ ఇప్పుడు వాటన్నిటికంటే
మన పక్కనే సమాజంలో ఉండే మనుషుల్ని చూసి భయపడాల్సిన పరిస్థితి.. ఇంతకంటే భారతదేశంలో జరగాల్సిన అభివౄద్ది ఏముంది??

                                                                                                                                  లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

అబ్బాయికి 'అప్పగింతలు' !!

అమ్మ కొడుకు...

మన ఊరి 'సంక్రాంతి'!!