ఉమెన్స్ కి ఉద్యోగాలా..?

ఉమెన్స్ కి ఉద్యోగాలా..?



నీకెందుకే ఉద్యోగం?? చక్కగా ఇంట్లో కూర్చొని "ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" సీరియల్ చూసుకుంటూ.. ఆ సీరియల్లో హీరోయిన్స్ లా ఇంట్లో పని వంటింట్లో వంట
చేసుకుంటూ హ్యప్పీగా బ్రతికెయ్యకా?? అయినా మీరు ఉద్యోగాలు చేసి ఏం ఒలకబెట్టాలి?  ఆ తిప్పలేవో వచ్చే వాడే పడతాడులే కానీ నీకెందుకు చక్కగా పెళ్ళి చేసుకొని ఇంటి పట్టున ఉండక??
ఇవి మన ఇళ్ళళ్ళో, చెల్లెలో లేక కూతురో ఉద్యోగం చేస్తా అనగానే మన నోటి నుంచి రాలే శుభాషితాలు (శుభం కాని అషితాలు)..

స్వతంత్రంగా బ్రతకాలి, సొంత కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పే అమ్మాయిల గురించి నేనిక్కడ చర్చించదలుచుకోలేదు కానీ, మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయై పుట్టి,
వీధి బడిలో 10వ తరగతి వరకు చదువుకొని, అదే వీధిలో ఉన్న కాలేజి లో డిగ్రీ కూడా పూర్తి చేసి, బయటకి వస్తే.. నువ్వు ఏం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే కూర్చో అనే వినాలనిపించని మాట తల్లిదండ్రుల నోటి నుంచి...

మన కుటుంబం ఆర్ధికంగా స్థిరపడినదైతే, అమ్మాయిలకి ఈ ఉద్యోగం చేయాలన్న ఆలోచనే రాదు.. కానీ తల్లిదండ్రుల కాయ కష్టాలు చూడలేక,
తోడబుట్టిన వాడు తనకంటే చిన్న వాడు అయితేనే.. ఎలాగైనా ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకుంటుంది..

1. బస్ స్టాండ్ లో నిలబడిన ఆ 5 నిమిషాలు కూడా కొరుక్కు తినేట్టు చూసే ఈ సమాజానికి ఎదురీదుతూ...
2. ఎక్కువ నీళ్ళు తాగితే ఎక్కడ బయట బాత్ రూం కి పోవలసి వస్తుందేమో అన్న భయాల్ని ఆలోచిస్తూ...
3. ఆఫీస్ లో అడుగుపెట్టగానే, ఆశగా చూసే మగాళ్ళ మధ్యనుంచే తన సీట్ వరకు తల వంచుకు నడుస్తూ...
4. చీటికీ మాటికీ మేనేజెర్, ఒంటిని తాకుతూ మాట్లాడుతుంటే అవి కూడా పంటి కిందే భరిస్తూ...
5. రాత్రి షిఫ్ట్ లు అయినాసరే , మరో నిర్భయ అవుతానేమో అనే భయాన్ని లోపలే పెట్టుకోని లేని గంభీరాన్ని ప్రదర్సిస్తూ...

పైకి నవ్వుతూ ఉండేవాళ్ళే "ఉద్యోగం చేసే ఆడవాళ్ళు"..

ఇవన్నీ తోడపుట్టిన వాళ్ళకో తల్లిదండ్రులకో చెప్పుకోవచ్చు.. కానీ అలా చెప్పీ చెప్పగానే మనం అనే మొదటి మాట.. ఉద్యోగం మానేయ్..
అందుకే ఇంట్లో వాళ్ళకీ చెప్పలేక.. ఆ బాధల్ని భరించలేక, ఎలానో అలా కుటుంబం కోసం కష్టపడే వాళ్ళే "ఉద్యోగం చేసే ఆడవాళ్ళు".
ఉద్యోగం చేయడం మొదలెట్టాక, కుంటుంబ కష్టాలు తీరతాయేమో కానీ.. అమ్మాయిల కష్టాలు పెరుగుతాయి.. ఇది అందరికీ తెలిసిన, ఒప్పుకోలేని నిజం..

అమ్మాయిలు ఉద్యోగం చేస్తాను అంటే బరితెగించి కాదు, బలుపెక్కీ కాదు.. బాధ్యతతో..కుటుంబంపై ఉన్న బాధ్యతతో..(అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ..!!)

                                                                                                                                    లక్ష్మీనాథ్ దాసినశెట్టి

Comments

Popular posts from this blog

పట్టణంలో ఇంటికోసం..!!

అబ్బాయికి 'అప్పగింతలు' !!

నాన్న విలువ...